About Me

రివ్యూ : నేల టిక్కెట్టు

రివ్యూ : నేల టిక్కెట్టు


RaviTeja Nela Ticket Review

రివ్యూ: నేల టిక్కెట్టు
రేటింగ్‌: 2/5
తారాగణం: రవితేజ, మాళవిక శర్మ, జగపతి బాబు తదితరులు
సంగీతం: శక్తికాంత్ కార్తీక్
నిర్మాత: రామ్ తాళ్లూరి
దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ

మహానటి, రంగస్థలం లాంటి సినిమాలు చూసి…. టాలీవుడ్ కొత్త అడుగులు వేస్తోంది అని సంబరపడే లోపే…. అబ్బే ఎక్కువ సేపు అలా ఉండడానికి వీల్లేదు అని హెచ్చరించడానికి కాబోలు…. అతి తక్కువ గ్యాప్ లోనే కొన్ని ఆణిముత్యాలు వస్తూ ఉంటాయి. కొన్ని నిజంగానే మెప్పిస్తే…. కొన్ని మాత్రం చుక్కలు చూపించేస్తాయి.

రవితేజ నేల టిక్కెట్టు అనగానే మాస్ ప్రేక్షకుల్లో ఒక రకమైన ఆసక్తి, అంచనా. చాలా రోజుల తర్వాత తనదైన శైలిలో మాస్ మహారాజ పేరున్న రవితేజ ఏదైనా మేజిక్ చేస్తాడేమో అని…. మరి అంతంత మాత్రం అంచనాలతో వచ్చిన నేల టిక్కెట్టు వాటిని అందుకునేలా ఉందా లేదా అనేది చూద్దాం….

కథ గురించి తక్కువగా మాట్లాడుకోవడం మంచిది. అనగనగా ఒక అనాథ… ఒక పెద్దయన పెంచి పెద్ద చేస్తాడు. ఆయనో పార్టీ మినిస్టర్ కూడా. దత్తత తీసుకున్న కొడుకే ఆస్తి మీద మోజుతో ఆ పెద్దాయనను బాంబు పెట్టి చంపేస్తాడు. దీంతో ప్రతీకారం కోసం రగిలిపోయిన మన అనాథ హీరో విలన్ కు తెలియకుండా హైదరాబాద్ వచ్చి మెల్లమెల్లగా అతన్ని నాశనం చేయటం మొదలు పెడతాడు. నేల టికెట్టు వాడు తలచుకుంటే ఎంతటి వాడైనా నేలకొరగాల్సిందే అని రుజువు చేస్తాడు. ఇదీ క్లుప్తంగా కథ.

రవితేజ రెండేళ్ల గ్యాప్ తీసుకుని మరీ వెనక్కు వచ్చాడు అంటే ప్రతీ కథ విషయంలో చాలా జాగ్రత్త వహిస్తాడు అని ఆశించారు ప్రేక్షకులు. కానీ మళ్ళీ అర్థం పర్థం లేని కథల వైపే రవితేజ మొగ్గు చూపిస్తున్నాడు అన్నది నిజం. టచ్ చేసి చూడు సినిమానే డిజాస్టర్ అనుకుంటే ఇది దానికి మించి ఉంది.

యాక్టింగ్ పరంగా రవితేజ ఎప్పటి లాగే బెస్ట్ ఇచ్చినప్పటికీ కథ మరీ అల్లావుద్దీన్ అద్భుత దీపం తరహాలో నమ్మశక్యం కానీ రీతిలో ఉండటంతో సీరియస్ మలుపులు, ఎమోషనల్ సన్నివేశాలు కూడా నవ్వుతెప్పిస్తాయి. తన టైమింగ్ తో ఎక్కడికక్కడ కవర్ చేసే ప్రయత్నం చేసిన రవితేజ… కొన్నిచోట్ల చేతులు ఎత్తేశాడు.

మాళవిక శర్మ గురించి ఒక లైన్ చెప్పడం కూడా వేస్ట్. జస్ట్ ఉత్సవ విగ్రహంలా పాటల కోసం మాత్రమే పనికి వచ్చింది. జగపతి బాబు విలన్ గా ఆయనకే బోర్ కొట్టింది కాబోలు చాలా యాంత్రికంగా నటించాడు. ఇంకో ముప్పై మంది ఆర్టిస్టులను తీసుకున్నారు కానీ ఎవరికీ గుర్తుండిపోయే స్కోప్ ఇవ్వకపోవడం వల్ల తెర నిండా వాళ్ళున్నా వృధా అయ్యారు.

కళ్యాణ్ కృష్ణ మొదటి రెండు సినిమాలను చూసి ఇందులో ఏదో ఊహించుకుంటే నిరాశ తప్పదు. మాస్ మసాలాతో అసలు ఏమి ఆశించి తీసాడో… అతను టార్గెట్ చేసిన మాస్ ప్రేక్షకులకు కూడా అర్థం కాదు. దుర్మార్గుడైన విలన్ మంత్రిని ఎవరి అండా లేని ఒక హీరో ఎదుర్కోవడం ఎన్టీఆర్ కాలం నుంచి చూస్తున్నాం. ఇందులో ఏదో వైవిధ్యం ఆశిస్తే అదే పెద్ద నేరమైనట్టు చాలా సిల్లీ కథనంతో ఓపికకు పరీక్ష పెట్టాడు కళ్యాణ్ కృష్ణ.

నాగార్జున సహాయంతో ద్వితీయ విఘ్నం తప్పించుకున్నాడు కానీ మూడోది మాత్రం పెద్ద దెబ్బ వేసింది. ఇది నా సినిమా అని గర్వంగా చెప్పుకోలేడు. అడిగినంత ఖర్చు పెట్టే నిర్మాతలు దొరికినప్పుడు మంచి కథా కథనాలు రాసుకోవాలి కానీ ఇలాంటి నాసి రకం కంటెంట్ తో చేసేది ఏమి లేదు.

ముకేశ్ ఛాయాగ్రహణం మాత్రం బాగుంది. చోటా కె ప్రసాద్ కత్తెర పని చేయలేదు. రామ్ లక్ష్మణ్ తో పాటు మరో నలుగురు కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ బాగానే వచ్చాయి. నిర్మాణం మాత్రం చాలా రిచ్ గా వచ్చింది.

చివరిగా చెప్పాలంటే నేల టిక్కెట్టు…. థియేటర్లలో నేల తరగతి ఉన్నప్పటి కాలానికి తీసుకెళ్లే ఔట్ డేటెడ్ మూవీ. కొత్తదనం ఏ కోశానా లేకుండా…. హీరో ఇమేజ్ తో సినిమా ఆడేస్తుంది అనే భ్రమలో తీసుకున్న ఒక అభూత కల్పన. ఎంత రవితేజా అయినా సరైన కంటెంట్ లేకపోతే ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో టచ్ చేసి చూడు రూపంలో చూసి మూడు నెలలు కూడా కాలేదు. ఈ లోపే అంత కన్నా పెద్ద గుణపాఠం నేర్పేందుకు తప్ప నేల టిక్కెట్టు ఎందుకూ ఉపయోగపడలేదు.

లాజిక్ లేని మలుపులతో…. ఓపికకు పరీక్ష పెట్టే స్క్రీన్ ప్లే…. కిచిడి లాంటి ఒక మాస్ మసాలాని చూడాలంటే తప్ప నేల టికెట్టు ఛాయస్ గా చెప్పుకునేందుకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు

Post a Comment

0 Comments