About Me

రివ్యూ: సమ్మోహనం

రివ్యూ: సమ్మోహనం


Sammohanam Movie Review

రివ్యూ: సమ్మోహనం
రేటింగ్‌: 2.75 /5
తారాగణం: సుధీర్‌ బాబు, అదితి రావు హైదరి, నరేష్‌, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేష్‌ తదితరులు
సంగీతం: వివేక్‌ సాగర్‌
నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్‌
దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ

సినీ తారను ప్రేమించే కుర్రాడి కథలను ‘శివరంజని’ సినిమా నుంచి చూస్తూనే ఉన్నాం. కానీ ఈ కుర్రాడి ప్రేమకథ భిన్నం. సినిమాలంటే అస్సలు ఇష్టం లేని, సినీ తారలపై సదాభిప్రాయం లేని ఓ కుర్రాడు.. ఒక హీరోయిన్‌ ప్రేమలో పడతాడు. ఆ హీరోయిన్ కూడా ఈ కుర్రాణ్ని ప్రేమిస్తుంది. ఒక స్టార్ హీరోయిన్, చిన్న పిల్లల బొమ్మలేసుకునే ఓ కుర్రాడి మధ్య నడిచే ప్రేమ కథే ఈ ‘సమ్మోహనం’. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఆవిష్కరించిన ఈ సున్నితమైన ప్రేమకథ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెద్దగా అంచనాలు లేకపోయినా దర్శకుడిపై ఉన్న నమ్మకంతో సినీ ప్రేమికులు ఈ చిత్రం కోసం వేచి చూశారు. మరి సినిమా ఎలా ఉందో చూద్దామా..

ఫైన్ ఆర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకుని పిల్లల కోసం బొమ్మలు గీస్తూ పుస్తక ప్రచురణ అవకాశం కోసం వేచి చూసే కుర్రాడు విజయ్ (సుధీర్‌బాబు). సినిమాలన్నా, సినీ తారలన్నా విజయ్‌కు అస్సలు పడదు. చులకన భావంతో చూస్తాడు. ఉత్తరాది నుంచి వచ్చి తెలుగులో పెద్ద హీరోయిన్‌గా ఎదిగిన అమ్మాయి సమీరా (అదితిరావు హైదరి). సినిమాలంటే విపరీతమైన పిచ్చి ఉన్న విజయ్ తండ్రి (నరేష్) తన ఇంటిని ఓ సినిమా షూటింగ్‌ కోసం ఇస్తారు. ఆ సినిమాలో హీరోయిన్ సమీరా. అలా అనుకోకుండా విజయ్, సమీరా కలుస్తారు. తెలుగు సరిగా రాని సమీరాకు విజయ్ తెలుగు డైలాగులు నేర్పిస్తాడు. దీంతో ఒకరిపై ఒకరికి ఇష్టం పెరుగుతుంది. విజయ్ కుటుంబానికి కూడా సమీరా దగ్గరవుతుంది. కానీ కొన్ని కారణాల వల్ల విజయ్ ప్రేమను సమీరా తిరస్కరిస్తుంది. అసలు ఏంటా కారణాలు, సినిమాలంటే ఇష్టపడని విజయ్ సమీరాను ఎలా ప్రేమించాడు, చివరికి వీళ్ల ప్రేమ ఫలించిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సింపుల్‌గా చెప్పాలంటే సినిమా పేరుకు తగ్గట్టే ‘సమ్మోహనం’గా ఉంది. ప్రేక్షకుడి మనసును హత్తుకునే సన్నివేశాలతో ఓ అందమైన ప్రేమకథను తెరపై ఆవిష్కరించారు దర్శకుడు. సినిమా టైటిల్స్‌తోనే తన సృజనాత్మకను చూపించారు. చిన్నపిల్లల కోసం అందంగా చెక్కిన బొమ్మల కాగితాలపై టైటిల్స్‌ను వేయడం ఆకట్టుకుంటుంది. డైలాగులు చాలా బాగున్నాయి. మధ్య మధ్యలో సినిమా వాళ్లపై సెటైర్లు వేస్తూ ప్రేక్షకులను నవ్వించారు. ఉత్తరాది నుంచి వచ్చే నటులు తెలుగును ఎంతలా ఖూనీ చేస్తున్నారో కాస్త చమత్కారంగా చెప్పారు.

సరదా సన్నివేశాలు, ఆకట్టుకునే కథనంతో ఫస్టాఫ్ ఎలా అయిపోయిందో కూడా ప్రేక్షకుడికి తెలీదు. సుధీర్‌బాబు, అదితి మధ్య వచ్చే ప్రతి సన్నివేశం చాలా బాగుంది. ముఖ్యంగా సినిమా తొలి భాగంలో వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. ఫస్టాఫ్‌ను చాలా వినోద భరితంగా తీర్చిదిద్దిన దర్శకుడు రెండో భాగాన్ని కాస్త సాగదీశారనిపిస్తుంది. కానీ సెంకడాఫ్‌లో కూడా సున్నితమైన భావోద్వేగాలు ప్రేక్షకుడి చేత కంటతడి పెట్టిస్తాయి. కథతో పాటు సాగే మధురమైన పాటలు, నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచాయి.

సినిమాలో ప్రతి పాత్ర కీలకమే. అన్ని పాత్రలు కథతో పాటే సాగుతూ ఉంటాయి. ఏ పాత్రనూ చొప్పించిన భావన ప్రేక్షకుడికి కలగదు. ఓ సినీ తారగా, ఓ కుర్రాడిని ప్రేమించిన అమ్మాయిగా అదితిరావు నటన చాలా బాగుంది. కళ్లతోనే భావేద్వేగాలను చూపిస్తూ ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించింది. ఇక సుధీర్‌బాబు విషయానికి వస్తే.. ఆయన నటనలో ఎంతో పరిణతి కనిపించింది. సున్నితమైన హావభావాలను పలికిస్తూ చాలా బాగా నటించారు. ఆయన కెరీర్‌లోనే ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇది. అంతేకాకుండా చాలా హ్యాండ్సమ్‌గానూ కనిపించారు. సినిమాలో చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన పాత్ర నరేష్‌ది. సినిమాలంటే పడిచచ్చిపోయే వ్యక్తి పాత్రలో అద్భుతంగా నటించారు. ప్రేక్షకులను విపరీతంగా నవ్వించారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌లో సమీరా అభిమానిగా ఆయన హంగామా సూపర్. ఇక తనికెళ్ల భరణి, పవిత్ర లోకేష్, రాహుల్ రామకృష్ణ, హరితేజ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సమ్మోహనం : ప్రేమ, కోపం, హాస్యం, భావోద్వేగాల కలబోతగా థియేటర్ నుంచి బయటకు వస్తారు.

Post a Comment

0 Comments