About Me

రివ్యూ : అభిమన్యుడు

రివ్యూ : అభిమన్యుడు


Vishal Abhimanyudu Review

రివ్యూ: అభిమన్యుడు
రేటింగ్‌: 3.5/5
తారాగణం: విశాల్, సమంతా
సంగీతం:యువన్ శంకర్ రాజా
నిర్మాత:  విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ
దర్శకత్వం: పి.ఎస్

తెలుగులో మంచి మార్కెట్ ఉన్న తమిళ హీరోల్లో విశాల్ ఒకరు. పొగరు, పందెం కోడి వంటి చిత్రాలతో తెలుగు వారికి దగ్గరయ్యారు విశాల్. ఆ తరువాత ‘పందెంకోడి’ చిత్రం స్థాయిలో హిట్ సినిమాను అందుకోలేదనే చెప్పాలి. సక్సెస్ కోసం అన్వేషణ సాగిస్తున్న క్రమంలో కొన్ని చిత్రాలతో హీరోగా మెప్పించాడు. తాజాగా తమిళంలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న 'ఇరుంబు తిరై' చిత్రాన్ని 'అభిమన్యుడు' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

తన తండ్రి అప్పులు చేయడం, అప్పులవాళ్లు ఇంటికి వచ్చి అడిగితే తప్పించుకొని తిరగడం వంటి విషయాలు కరుణాకరన్ (విశాల్) అలియాస్ కర్ణను బాగా ఇబ్బంది పెడతాయి. దీంతో పన్నెండేళ్లకే ఇంటి నుండి వెళ్ళిపోతాడు. మిలిటరీ ట్రైనింగ్ ఆఫీసర్‌గా జీవితం గడుపుతుంటాడు. విపరీతమైన కోపం ఉండే కర్ణను ఏంగర్ మేనేజ్మెంట్‌లో సర్టిఫికేట్ తీసుకురావాలని మిలిటరీ అధికారులు ఆర్డర్ వేస్తారు. దానికోసం లతాదేవి (సమంతా) అనే సైకియాట్రిస్ట్‌ను కలుస్తాడు. ఆమె సలహాల మేరకు నెల రోజుల పాటు సొంతూరు వెళ్లి గడపాలని నిర్ణయించుకుంటాడు. అక్కడకు వెళ్లిన తరువాత తన చెల్లెలకు పెళ్లి చేయాలసిన బాధ్యత తన మీద ఉందని తెలుసుకుంటాడు. తన దగ్గర పెళ్లికి కావల్సినంత డబ్బు లేకపోవడంతో బ్యాంక్‌లో లోన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎక్కడా లోన్ దొరకకపోతే ఓ ఏజెంట్ సహాయంతో ఫేక్ సర్టిఫికేట్స్‌తో తన తండ్రి పేరు మీద ఆరు లక్షల లోన్ తీసుకుంటాడు. డబ్బు అకౌంట్ లోకి వచ్చిన మరుసటి రోజునే ఆరు లక్షలతో పాటు తన అకౌంట్‌లో ఉన్న మరో నాలుగు లక్షలు మొత్తం పది లక్షల రూపాయలు మాయమైపోతాయి. ఇలా డబ్బు పోగొట్టుకుంది తను ఒక్కడు మాత్రమే కాదని చాలా మంది అమాయకులు ఇలానే నష్టపోయారని తెలుసుకుంటాడు. దీనంతటికీ కారణం వైట్ డెవిల్ (అర్జున్) అని కర్ణకు తెలుస్తుంది. ఇంతకీ ఈ వైట్ డెవిల్ ఎవరు..? ఎవరికీ తెలియని సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అతడికి ఎలా తెలుస్తుంది..? కర్ణ ఇతడిని ఎలా ఎదుర్కొన్నాడు..? అనేదే సినిమా. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్.. ఇదే సినిమాకు మెయిన్ కాన్సెప్ట్. మనకు తెలియకుండానే ఇంటర్నెట్‌లో కొన్ని సైట్స్‌ను ఓపెన్ చేయడం.. 'Allow' అని ఆప్షన్ వచ్చే ప్రతిసారి ఓకే చేయడం చేస్తుంటాం. అంటే మన ఇన్ఫర్మేషన్ పక్క వాడికి ఇస్తున్నట్లే.. ఈ ఇన్ఫర్మేషన్‌ను కరెక్ట్‌గా వాడుకొని మన కారణంగా వాడు కోట్లు సంపాదించుకుంటున్నాడు. షాపింగ్ మాల్స్‌లో కూపన్స్ ఫిల్ చేయండి మీకు గిఫ్ట్ ఇస్తామంటూ బలవంతంగా మన ఇన్ఫర్మేషన్ సేకరిస్తారు. మనం కూడా ఫ్రీగా గిఫ్ట్ వస్తుంది కదా అని మన ఇన్ఫర్మేషన్ మొత్తం రాసేస్తాం. దాన్ని కాస్త వాళ్ళు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు.

కాల్ సెంటర్స్, బ్యాంక్స్ నుండి కాల్ చేసి మీకు ఆ లోన్ ఇస్తాం.. ఈ లోనే ఇస్తాం.. తీసుకోండి అంటూ తెగ బ్రైన్ తింటారు. అసలు వాళ్లకి మన ఫోన్ నెంబర్స్ ఎలా వెళ్తున్నాయని ఒక్కసారైనా సీరియస్‌గా ఆలోచించామా..? లేదు. ఏదో ఫోన్ వచ్చింది ఆన్సర్ చేశాం అన్నట్లు వదిలేస్తాం. కానీ మన ఇన్ఫర్మేషన్ మొత్తం సేకరించి మన డేటాను వాళ్ల దగ్గర పెట్టుకుంటున్నారు. ఇన్ఫర్మేషన్‌ను సరిగ్గా ఉపయోగించడం తెలిసినవాడికి అది ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు ఆయుధం.. దీన్నే ఒక చిత్రంగా 'అభిమన్యుడు' రూపంలో మలిచారు దర్శకుడు మిత్రన్.

దర్శకుడు అనుకున్న పాయింట్ చాలా బాగుంది. డిజిటల్ క్రైమ్‌లో మనకు తెలియకుండానే ఎలా చిక్కుకుంటున్నామో కళ్లకు కట్టిచూపించారు. మ‌న చేతిలోని స్మార్ట్‌ఫోనే మ‌న జీవితాన్ని మ‌రొక‌డి చేతుల్లో ఎలా పెడుతుందో.. టెక్నాలజీ యుగంలో మనం ఎంత ప్రమాదపు అంచున ఉన్నమో అలర్ట్ చేస్తూ యాక్షన్ థ్రిల్లర్‌ను అందించారు దర్శకుడు. అనునిత్యం మనకు ఎదురయ్యే వాస్తవ పరిస్థితుల్ని తెరపై చూపించాడు. సైబ‌ర్ నేర‌గాళ్ల చేతుల్లో పడకుండా హెచ్చరించారు. డిజిట‌ల్ క్రైమ్, సైబ‌ర్ నేరాలు బారిన పడకుండా ఇప్పుడున్న పరిస్థితిల్లో ఈ సినిమా చాలా అవసరమే.

అయితే ఒక ఒక విషయాన్ని చెప్పడానికి మూడు గంటల సేపు సినిమా సాగదీసి చూపించాడనే భావన కలుగుతుంది. సినిమా ఫస్ట్ హాఫ్ సాదాసీదా సన్నివేశాలతో గడిచిపోతుంది. సెకండ్ హాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. మైండ్ గేమ్ నేపధ్యంలో సాగే కథ కాబట్టి కంటెంట్ ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి. కానీ ఈ సినిమాలో అది మిస్ అయిందనే చెప్పాలి. కొన్ని సన్నివేశాల్లో లాజిక్స్ ఉండవు. సినిమాలో హీరో పాత్ర కంటే విలన్ పాత్ర ఆడియన్స్ ను బాగా ఎట్రాక్ట్ చేస్తుంది. అటువంటి పాత్రలో అర్జున్ జీవించేశాడనే చెప్పాలి. ఇక పతాక సన్నివేశాల్లో హీరో, విలన్ ఎదురుపడినప్పుడు అర్జున్ హీరోను బాగా డామినేట్ చేసేశారు. విశాల్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. తన బాడీ లాంగ్వేజ్‌తో మిలిటరీ ఆఫీసర్ పాత్రలో ఇమిడిపోయారు. సమంతా పాత్ర చెప్పుకునే స్థాయిలో లేనప్పటికీ తెరపై చాలా అందంగా కనిపించింది. యువన్ శంకర్ రాజా అందించిన నేపధ్య సంగీతం చక్కగా కుదిరింది. ముఖ్యంగా విలన్ పాత్ర తెరపై కనిపించే ప్రతిసారి వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడలేదు.

దర్శకుడు మిత్రన్ తనదైన స్టయిల్‌లో ఈ చిత్రాన్ని హ్యాండిల్ చేశాడు. హీరో చెల్లెలు, నాన్న క్యారెక్టర్‌తో ఎమోషన్ పండించాడు. కామెడీను ఇరికించే ప్రయత్నం చేశాడు. అయితే తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతవరకు కనెక్ట్ అవుతుందనే విషయం చెప్పలేని పరిస్థితి. టెక్నాలజీ, హ్యాకింగ్, వంటి విషయాలు అందరికీ అర్ధమయ్యే అవకాశం లేదు కాబట్టి బి,సి సెంటర్స్‌లో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం కష్టమే.

అభిమన్యుడు: ఓ మంచి పాయింట్ టచ్ చేసి సినిమా చేశారు కాబట్టి కచ్చితంగా ఒకసారైతే ఈ సినిమాను చూసి తీరాల్సిందే.

Post a Comment

0 Comments