About Me

రివ్యూ: కాలా

రివ్యూ: కాలా


Rajinikanth kaala review

రివ్యూ: కాలా
రేటింగ్‌: 2.5 /5
తారాగణం: రజినీకాంత్, హ్యుమా ఖురేషి, నానా పటేకర్, సముద్రకని  తదితరులు
సంగీతం:  సంతోష్ నారాయణ్
నిర్మాత: ధనుష్ 
దర్శకత్వం:  పా. రంజిత్


మాఫియా నేపథ్యంలో సౌత్ లో సినిమాలు వరస బెట్టి రావడానికి ఊతమిచ్చింది సూపర్ స్టార్ రజినీకాంతే. బాషా సినిమా ద్వారా పాతికేళ్ల క్రితం సెట్ చేసిన స్టాండర్డ్ ఈ రోజుకీ ఫిలిం మేకర్స్ ఫాలో అవుతున్నారు అంటే దానికి కారణం సురేష్ కృష్ణ మేజిక్ తో పాటు రజినీలో ఉండే ఇన్ బిల్ట్ స్టైల్‌. ఆ తర్వాత ఈ ఛాయల్లో ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ దాన్ని మాత్రం బీట్ చేయలేకపోయాయి.

ఎవరో ఎందుకు రజనినే స్వయంగా దాన్ని రీ క్రియేట్ చేయలేకపోయాడు. కానీ సూపర్ స్టార్ ఫాన్స్ మాత్రం కాలా ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచి ఆ దిశగానే దీని మీద అంచనాలు పెంచుకుంటూ వచ్చారు. ప్రేక్షకుల్లో అంతగా హోప్స్ లేనప్పటికీ ఏదైనా ఉండొచ్చు అనే కనీస ఆసక్తితో ఎదరుచూశారు. కాలా ఈ రోజు విడుదలైంది.

ఇది ఏళ్ళ నాటి పాత కథ. కొత్తదనం ఏమీ లేదు. హీరో ఉంటున్న ప్రాంతాన్ని కబ్జా చేయాలని ప్రయత్నించే ఒక విలన్ మినిస్టర్ ని హీరో ఎదుర్కోవడం అనే పాయింట్ ఎన్ని సినిమాల్లో వచ్చిందో లెక్క బెట్టడం కష్టం. రామ్ చరణ్ ఎవడు సినిమాలో కూడా మెయిన్ స్టోరీ ఇదే ఉంటుంది. కానీ వాటికి దీనికి తేడా ఒక్క సూపర్ స్టార్ మాత్రమే.

కాలా నివసించే ధారవిలో బడుగు వర్గాల ప్రజలే అధికంగా ఉంటారు. సిటీ మధ్యలో ఉండే దాని మీద పెద్దల కన్ను పడుతుంది. మంత్రి హరిదాదా(నానా పటేకర్)రంగంలోకి దిగుతాడు. కాలాకు అతనికి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఉనికిని, హక్కులను కాపాడుకోవడం కోసం ధారవి జనాన్ని ప్రేరేపిస్తాడు కాలా. చివరికి ఎవరు విజయం సాధిస్తారో ఈజీగా గెస్ చేయగలిగే క్లైమాక్స్ .

రజని కాలా నల్ల దుస్తులతో తెల్ల గెడ్డంతో కాస్త కొత్తగా కనిపించేలా చేసి ఫ్రెష్ నెస్ తీసుకొచ్చారు కానీ అవి కాకుండా రెగ్యులర్ గెటప్ లోనే చూపించి ఉంటే కాలా ఇంకా మామూలు సినిమా అయ్యేది. తనదైన శైలిలో కాలా పాత్రను రజినీ తన భుజాల మీద పూర్తిగా మోశాడు. అభిమానులను అలరించేలా చేయగలిగింది చేసాడు.

వయసు భారాన్ని లెక్క చేయకుండా ఇంకా ఇలాంటి సినిమాలు చేస్తున్న రజినీ హార్డ్ వర్క్ కు వంక పెట్టాల్సిన పని లేదు. పైగా గెంతులు, డ్యూయెట్లు మాని ఇలా వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకోవడం సరైన నిర్ణయమే.

నానా పటేకర్ హరిదాదాగా పర్ఫెక్ట్ ఛాయస్ అనిపించాడు. హ్యుమా ఖురేషి బాగుంది. ఆర్టిస్టులు చాలానే ఉన్నారు కానీ అందులో ఎవరు ఓవర్ యాక్షన్ చేయలేదు అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. సమితిరఖని అందరిలో ఫస్ట్ ర్యాంక్ కొట్టేసాడు.

దర్శకుడు రంజిత్ పా ఊహించినట్టే తన రెండో అవకాశాన్ని పూర్తిగా వృథా చేసుకున్నాడు. శక్తివంతమైన నాయకుడిగా కాలాను చూపించడం మానేసి ఫస్ట్ హాఫ్ మొత్తం టైం వేస్ట్ చేసిన రంజిత్ సెకండ్ హాఫ్ ని పూర్తి సీరియస్ గా మార్చే క్రమంలో పూర్తిగా అదుపు తప్పాడు.

మలుపులు లేకుండా విలన్ హీరో వర్గంలోని ఒక్కొక్కరిని చంపుకుంటూ పోవడం, హీరో విలన్ ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇవ్వడం ఇవేవీ ఆకట్టుకునేలా తీయలేకపోయాడు. దానికి తోడు ముంబై నేటివిటీతో పాటు అందరూ తమిళ్ యాక్టర్స్ కావడంతో హిందీ డబ్బింగ్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.

పైగా రామాయణ కథను బ్యాక్ గ్రౌండ్ లో చెప్పిస్తూ రజినిని చంపినట్టు చూపడం పైత్యానికి పరాకాష్ట. స్క్రీన్ ప్లేని తన చిత్తానికి రాసుకుంటూ పోయిన రంజిత్ పా తాను డీల్ చేస్తోంది సూపర్ స్టార్ ని అనే సంగతి మరోసారి మర్చిపోయాడు. ఫలితం మరో డిజాస్టర్ వచ్చేలాగే ఉంది.

సంతోష్ నారాయణ్ బిజిఎం వరకు పర్వాలేదు కానీ పాటలు మాత్రం చెవులకు చిల్లులు పెట్టాయి. ప్రవీణ్ కెమెరా పనితనం మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. ధనుష్ మావయ్య కోసం భారీగా ఖర్చు పెట్టాడు కానీ అంతా బూడిదలో పోసిన పన్నీరే .

చివరిగా చెప్పాలంటే కబాలి గాయాన్ని మాన్పుతుంది అనుకుంటే కాలా దాన్ని తిరగబెట్టేలా ఉంది. కళ్ళు చెదిరే బడ్జెట్ చేతిలో పెట్టి సూపర్ స్టార్ ఇచ్చిన మరో అవకాశాన్ని చేజేతులా పాడు చేసుకున్న రంజిత్ పా పైత్యాన్ని చూడడానికి తప్ప కాలా దేనికీ ఉపయోగపడలేదు.

కెరీర్లో అతి కొద్ది సినిమాలు మాత్రమే చేసే అవకాశం ఉన్న రజనీకాంత్ ని ఇలా వృధా చేసుకోవడం ఫ్యాన్స్ కే కాదు సినిమా ప్రేమికులందరిని బాధ పెట్టేదే. నిట్టూర్చడం తప్ప ఏమీ చేయలేం.

Post a Comment

0 Comments