About Me

రివ్యూ : తేజ్ ఐ లవ్ యు

రివ్యూ : తేజ్ ఐ లవ్ యుTej I love u movie review

రివ్యూ:  తేజ్ ఐ లవ్  యు


రేటింగ్‌:  2.5/5
తారాగణం:  సాయి ధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్, జయ ప్రకాష్, పవిత్ర లోకేష్, పృథ్వి తదితరులు
సంగీతం:  గోపి సుందర్
నిర్మాత:  కెఎస్ రామారావు
దర్శకత్వం:  కరుణాకరన్


అనగనగా ఒక తెలుగు సినిమా కథ అని ముందు తరానికి చెబుతూ పాత క్లాసిక్స్ ని రీ మిక్స్ చేసి చూపించే పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది కొన్ని సినిమాలు చూస్తుంటే. కొన్ని మాత్రం మన తెలుగు సినిమా స్టాండర్డ్స్ హాలీవుడ్ రేంజ్ కి వెళ్లిపోతుందేమో అని నమ్మకం కలిగించేలా చేస్తాయి.

కానీ గత ఆరు నెలల కాలంలో టాలీవుడ్ ని పలకరించిన సినిమాలను చూస్తే రెండో బ్యాచ్ లో వస్తున్న సినిమాల కంటే మొదటి సిరీస్ లో వస్తున్నవే ఎక్కువగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఒక మెగా కాంపౌండ్ హీరో సినిమా ఇంత తక్కువ అంచనాలతో రావడం బహుశా తేజ్ ఐ లవ్ యు విషయంలోనే జరిగి ఉంటుంది. ట్రైలర్ తో పాటు ఆడియో కూడా ఏమంత మెప్పించేలా లేకపోవడం… ముందు నుంచే మైనస్ కాగా…. ఫైనల్ గా పరాజయాల పరంపరకు తేజు బ్రేక్ వేసుకున్నాడా చూద్దాం….

చిన్నప్పుడు హీరోయిన్ తల్లిని ఎవరూ లేని ఏకాంత ప్రదేశంలో కొందరు అటకాయించబోతే తేజు (సాయి ధరమ్ తేజ్) అందులో ఒకడిని చంపి బాల నేరస్తుడిగా జైలుకు వెళ్తాడు. అమ్మానాన్నా లేని తనంటే బాబాయ్, పెదనాన్న కుటుంబాలకు ప్రాణం. హీరోయిన్ కుటుంబం ఆ సంఘటన జరిగాక లండన్ వెళ్ళిపోతుంది.

జైలు నుంచి వచ్చాక తేజు ఫ్యామిలీతో సరదా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. చెల్లికి తన ప్రియుడితో దొంగతనంగా పెళ్లి చేయటంతో ఇంటి నుంచి గెంటేస్తాడు పెదనాన్న(జయ ప్రకాష్). వైజాగ్ వెళ్లి చిన్నాన్న(పృథ్వి)ఇంట్లో సెటిల్ అవుతాడు. అమ్మ చివరి కోరిక తీర్చడం కోసం ఇండియా వస్తుంది నందిని (అనుపమ పరమేశ్వరన్).

తేజుతో సరదాగా మొదలైన పరిచయం ప్రేమగా మారుతుంది. అప్పుడే జరిగిన ఒక యాక్సిడెంట్ లో నందిని గతం మర్చిపోతుంది. తేజు కు కొత్త సవాల్ మొదలవుతుంది. తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అనేదే మిగిలిన కథ.

సాయి ధరమ్ తేజ్ ఐదు ప్లాప్లకు బ్రేక్ వస్తుందేమో అన్న అభిమానుల అంచనాలకు భిన్నంగా డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేసాడు. నటన పరంగా లవర్ బాయ్ గా ఆ పాత్రలో బాగానే ఒదిగిపోయిన తేజు…. పట్టు తప్పిన శరీరం కాస్త లావుగా మార్చడం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఆ లోపం ఒక్కటి మినహాయిస్తే తేజు బాగానే చేసాడు.

తన బలమైన డాన్స్ లను పూర్తిగా పక్కన పెట్టేసాడు. కథనే అలా ఉంది కాబట్టి మరీ ఛాలెంజింగ్ అనిపించే మెటీరియల్ తేజ్ పాత్రలో లేదు. దీని కంటే జవాన్ లోనే సాయి ధరమ్ తేజ్ కాస్త ఫిట్ గా కనిపించాడు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ బాగుంది. ఫస్ట్ హాఫ్ లో కాస్త కామెడీ పండించే అవకాశాన్ని బాగా వాడుకుంది. సీన్లు పేలవంగా ఉండటంతో సెకండ్ హాఫ్ లో ఎంత ఎమోషన్స్ పలికించినా అవన్నీ తేలిపోయాయి.

ఇందులో విలన్ అంటూ ఎవరూ లేరు. జయప్రకాశ్, పృథ్వి, పవిత్ర లోకేష్, సురేఖ వాణి, వైవా హర్ష, జోష్ రవి అందరు సపోర్టింగ్ రోల్స్ లో చేయాల్సింది చేసారు. బలమైన కథ వాళ్లకు అండగా లేకపోవడంతో హెల్ప్ లెస్ గా మారారు.

దర్శకుడు కరుణాకరన్ ఇంకా 2000 సంవత్సరంలోనే ఉన్నాడు. పవన్ తొలిప్రేమ రోజుల నుంచి ఇంకా బయటికి రావడం లేదు. తన సినిమాలను తానే కాపీ కొట్టుకునే గొప్ప టాలెంట్ ఉన్న దర్శకుడు కరుణాకరన్. దీన్ని డార్లింగ్, తొలిప్రేమ, ఎందుకంటే ప్రేమంట, వాసు లాంటి తాను తీసిన సినిమాల నుంచే పాయింట్స్ తీసుకుని కాపీ కొట్టేసి ఈ కథ రాసుకున్నాడు.

కుటుంబం నుంచి వెలి వేయబడ్డ కొడుకు, గతం మర్చిపోయిన హీరోయిన్, స్నేహితుల గ్యాంగ్, విలన్ లా ప్రవర్తించే హీరోయిన్ తండ్రి…. ఇలా అరిగిపోయిన చింతకాయ పచ్చడి కథను అంత కన్నా తీసికట్టు అనిపించే కథనంతో…. ప్రేక్షకుల ఓపికతో ఆడుకున్నాడు దర్శకుడు.

ఫస్ట్ హాఫ్ అంతంత మాత్రంగా తట్టుకోవచ్చులే అనుకునే లోపే…. సెకండ్ హాఫ్ లో గతం మర్చిపోయిన హీరోయిన్ ఎపిసోడ్…. ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా అనిపించేలా చేసింది. చివర్లో క్లైమాక్స్ సీన్ కి కళ్ళు చెమ్మగిల్లాల్సింది పోయి నవ్వుకుంటూ బయటికి వచ్చేలా చేసాడంటే ఇతని ప్రతిభ గురించి చెప్పడం మాటల్లో కష్టం.

లైట్ కామెడీ తో కాసులు రాలే కాలం కాదిది. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ దాకా మెప్పించే కంటెంట్ ఉంటే తప్ప సినిమాలు ఆడటం లేదు. అలాంటిది ఇలాంటి అవుట్ డేటెడ్ ఫార్ములాతో సినిమా తీసిన కరుణాకరన్ ధైర్యానికి, ఒప్పుకున్న నిర్మాత కెఎస్ రామారావు, హీరో సాయి ధరమ్ తేజ్ తెగువకు హాట్స్ ఆఫ్ చెప్పాలి.

డార్లింగ్ స్వామి మాటలు కొన్ని సీన్లలో మాత్రమే పేలాయి. గోపి సుందర్ మ్యూజిక్ ఓ రెండు పాటల్లో తప్ప మొత్తంగా బి గ్రేడ్ అవుట్ ఫుట్ తో వచ్చింది. శేఖర్ ఎడిటింగ్ కి పెద్దగా పని చెప్పలేదు. ఆండ్రీ కెమెరా పనితనం ఒక్కటే కాస్త చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. సబ్జెక్టు డిమాండ్ మేరకు నిర్మాత బాగానే ఖర్చు పెట్టాడు

ఫైనల్ గా చెప్పాలంటే పాత ప్రేమ కథలకు మెమరీ లాస్ అనే కోటింగ్ ఇచ్చి కరుణాకరన్ తీసిన మర్చిపోదగ్గ మాస్టర్ పీస్ తేజ్ ఐ లవ్ యు. బిగి లేని స్క్రీన్ ప్లే తో సెకండ్ హాఫ్ మొత్తం అర్థం లేని సన్నివేశాలతో నడిపించేస్తే ఏదోలా ప్రేక్షకులు పాస్ చేస్తారులే అన్న కరుణాకరన్ నమ్మకం నిలవడం కష్టం.

కనిష్ట స్థాయి కామెడీ ఉన్నా పరవాలేదు…. ప్రేమ కథ అయితే చాలు…. అది ఎలా తీసినా పట్టించుకోము అనుకునే ప్రేక్షకులకు తప్ప…. తేజ్ ఐ లవ్ యు అందరి చేత బాగుంది అనిపించే కంటెంట్ అయితే లేదు.

Post a Comment

0 Comments