About Me

రివ్యూ : నా నువ్వే

రివ్యూ : నా నువ్వే


Kalyanram Naa Nuvve Movie Review

రివ్యూ: నా నువ్వే
రేటింగ్‌: 1.5 /5
తారాగణం: కల్యాణ్ రామ్‌, తమన్నా, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళీ, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం: శరత్
నిర్మాత: విజయ్‌ కుమార్‌ వట్టికూటి, కిరణ్ ముప్పవరపు
దర్శకత్వం:  జయేంద్ర


మాస్ హీరోలు ప్రేమ కథలు చేయటం ఎప్పుడూ రిస్కే. అందుకే చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల కెరీర్లలో భూతద్దం వేసి చూసినా గొప్ప ప్రేమ కథ ఉన్న సినిమా ఉండదు. వాళ్ళను సీనియర్లు అనుకుంటే తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ కూడా పూర్తి స్థాయి ప్రేమ కథను ఇప్పటి దాకా చేయలేదు.

వీళ్ళ స్థాయి లేనప్పటికీ కళ్యాణ్ రామ్ కు సైతం నందమూరి కాంపౌండ్ హీరోగా ఎంతో కొంత ఇమేజ్ అయితే ఉంది. కాకపోతే మాస్ పాత్రల్లోనే ఇంత దాకా కనిపిస్తూ వచ్చిన కళ్యాణ్ రామ్ మొదటిసారి ఒక సాఫ్ట్ లవ్ స్టోరీ చేసాడు. అంచనాలు లేకపోయినా బాగుంది అనే టాక్ వస్తే అదే పికప్ అవుతుంది అనే నమ్మకంతో నా నువ్వేని విడుదల చేసారు.

మీరా (తమన్నా) కు డెస్టినీ అంటే పిచ్చి. జీవితంలో ప్రతిదీ దాని ప్రకారమే జరుగుతుంది అని బలంగా నమ్ముతుంది. వరుణ్ (కళ్యాణ్ రామ్) డెస్టినీ లేదని నమ్మే వ్యక్తి. అమెరికా వెళ్లాలనే ప్రయత్నాలు వివిధ కారణాల వల్ల మూడు సార్లు ఫెయిల్ అవుతాయి. ఓసారి అనుకోకుండా వరుణ్ ఫొటో మీరాకు చేరుతుంది.

అప్పటి నుంచి తనకు మంచి టైం స్టార్ట్ అయిపోయి రేడియో ఆర్ జెగా ఉద్యోగం వస్తుంది. కొంత కాలం అయ్యాక వరుణ్ మీరాలు కలుసుకుంటారు. డెస్టినీ విషయంలో ఇద్దరికీ అభిప్రాయ భేదాలు ఉండటంతో ఓ పందెం వేసుకుంటారు. దాని వల్ల కలిసినట్టే కలిసి మళ్ళీ విడిపోతారు. దీంతో వరుణ్ ని తన దగ్గరకు వచ్చేలా చేసుకోవడం కోసం వాలెంటైన్స్ డే రోజు ఒక లైవ్ షో చేస్తుంది మీరా. మరి ఇద్దరు కలుసుకున్నారా లేదా అనేది తెలుగు ప్రేక్షకులు ఈజీగా ఊహించగలిగే క్లైమాక్స్.

కళ్యాణ్ రామ్ తాను ఏ సినిమాలకు ఫిట్ అవుతాడో అర్థం కాని కన్ఫ్యూషన్ లో ఉన్నాడు. అందుకే ఈ కథ ఓకే చేసినట్టు ఉన్నాడు. తనవరకు బాగానే చేసాడు కానీ కథలో దమ్ము లేకపోవడంతో తేలిపోయాడు. దానికి తోడు మీసాలు తీసేయడంతో ఇంకాస్త వయసు బయటపడి అంతగా నప్పలేదు అనే ఫీలింగ్ కలిగిస్తాడు.

ఎమోషన్స్ కు స్కోప్ ఉన్న చోట తన మార్క్ చూపించాడు. కాకపోతే పటాస్ లాంటి సినిమాలతో మెప్పించిన కళ్యాణ్ రామ్ ని ఇలాంటి ప్రేమ కథల్లో ప్రేక్షకులు చూడటం కష్టమే. తమన్నా బాగుంది. సీనియర్ అయినప్పటికీ మిల్కీ బ్యూటీనెస్ తో మీరాగా బాగా నప్పింది కూడా. అక్కడక్కడా కొంచెం శృతి తప్పినా ఫైనల్ గా తనే బెటర్ అనే ఫీలింగ్ కలిగిస్తుంది.

మీరా తల్లితండ్రులుగా తనికెళ్ళ భరణి, సురేఖా వాణివి పరమ రొటీన్ పాత్రలు. పోసాని కూడా అంతే . హీరో ఫ్రెండ్స్ గా చేసిన వెన్నెల కిషోర్, ప్రవీణ్ సోసోగా అలా బండి నడిపించేసారు. చెప్పుకోవడానికి అంత స్కోప్ లేదు కనక ఒక్కొక్కరి గురించి మాట్లాడుకోవడం అనవసరం.

దర్శకుడు జయేంద్రలో మంచి టెక్నీషియన్ ఉన్నాడు కానీ దర్శకుడు మాత్రం లేడు. పేలవమైన కథతో రెండు గంటల సినిమాను మూడు గంటలు చూశామా అనే ఫీలింగ్ కలిగించేలా చేసాడంటే అది అతని వైఫల్యమే. హీరోయిన్ ని డెస్టినీ అంటే పడిచచ్చిపోయే పాత్రగా డిజైన్ చేసిన జయేంద్ర తనకు అంతకు మించిన స్వంత వ్యక్తిత్వం లేదు అన్నట్టుగా చూపడం అంతగా అతకలేదు. ఈ విషయంలో హీరో పాత్రనే బెటర్ అనిపిస్తుంది. అన్ని డెస్టినీ చేయిస్తే ఇక మనం స్వంతంగా ఆలోచించడం ఎందుకు అనేలా ఉన్నాయి జయేంద్ర కథా కథనాలు.

ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా వెళ్లినా మరీ బోర్ కొట్టకుండా కొంత ప్రయత్నం చేసిన జయేంద్ర సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి పూర్తిగా దారి తప్పాడు. హీరో హిరోయిన్లు కలుసుకోవడానికి రేడియో ఎఫ్ఎంలో లైవ్ ప్రోగ్రాం చేయటం, రైల్వే స్టేషన్ లో గార్డ్ వచ్చి ఆటో గ్రాఫ్ తీసుకోవడం, విధి మన చేతుల్లో ఉన్నట్టు చూపించడం కోసం కొన్ని ఎపిసోడ్లు నాటకీయంగా రాసుకోవడం అన్నీ లోపాలే. ఎక్కడా ప్రేక్షకుడు కన్విన్స్ అయ్యే ఛాన్స్ ఇవ్వలేదు.

అందుకే భారంగా నడిచే నా నువ్వే క్లైమాక్స్ కోసం ఎదురు చూసేలా సాగింది స్క్రీన్ ప్లే. శరత్ సంగీతం రెండు పాటల వరకు మాత్రమే పరిమితం. మిగిలినవి ఏదో కొట్టాలి అంటే కొట్టాడు అంతే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నప్పింది. పిసి శ్రీరామ్ కెమెరా పుణ్యమా అని విజువల్స్ ఆకట్టుకోవడంతో పాటు థియేటర్ లో కాసేపు కూర్చునేలా చేసాయి. నిర్మాణ విలువల గురించి చెప్పడానికి ఏమి లేదు. బడ్జెట్ లో కానిచ్చేశారు.

చివరిగా చెప్పాలంటే ఎటువంటి ప్రత్యేకత లేని ఒక మామూలు సాగతీత చిత్రం నా నువ్వే. తమన్నా వీరాభిమానులు కళ్యాణ్ రామ్ ను బాగా ఇష్టపడే వాళ్లకు తప్ప సినిమా చివరి దాకా చూసే అవకాశం ఇవ్వడంలో నా నువ్వే పూర్తిగా ఫెయిల్ అయ్యింది. కళ్యాణ్ రామ్ కొత్తగా ప్రయత్నించడం బాగానే ఉంది కానీ దర్శకుడు జయేంద్ర కొత్తగా ఆలోచించకపోవడంతో అసలు చిక్కు వచ్చి పడింది.

డెస్టినీ అంటూ ప్రతి సీన్…. మొదలు, చివర పదే పదే చెప్పించిన దర్శకుడు ఆ ఉచ్చులో పడి ఎమోషన్ లేని ఒక ప్రేమ కథను ప్రెజెంట్ చేసాడు. ట్రైలర్ లో ఉన్న ఫీల్ సినిమాలో పూర్తిగా లోపించింది. దీనికి మించి చెప్పడానికి కానీ… చెప్పుకోవడానికి కానీ… నా నువ్వేలో ఏమీ లేదు.

నా నువ్వే : లాజిక్ లేని సాగతీత ప్రేమ

Post a Comment

0 Comments