About Me

రివ్యూ: జంబ లకిడి పంబ

రివ్యూ: జంబ లకిడి పంబ


Jamba Lakidi Pamba Movie Review

రివ్యూ: జంబ లకిడి పంబ
రేటింగ్‌: 1.5 /5
తారాగణం:  శ్రీనివాస్‌ రెడ్డి, సిద్ధి ఇద్నాని, పోసాని కృష్ణ మురళీ, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్‌ తదితరులు
సంగీతం:   గోపి సుందర్‌
నిర్మాత:  రవి, జోజో జోస్‌, శ్రీనివాస్‌ రెడ్డి
దర్శకత్వం:  జేబీ మురళీ కృష్ణ


మనకు కొత్త ఐడియాలు రాకపోతే ఏం చేయాలి. పాత క్లాసిక్స్ ని బయటికి తీసి అదే పేరుతో కిచిడి చేసి కొత్త యాక్టర్స్ తో తీసి ప్రేక్షకుల మీదకు వదలాలి. కొందరి దర్శకుల ధోరణి ఇలాగే ఉంది. సృజనాత్మకత అడుగంటిపోయినప్పుడు దర్శకులు చేసే ప్రయోగాలు వికటించి చూసేవాళ్లకు ఎంతటి నరకాన్ని మిగులుస్తున్నాయో చూస్తున్నా కూడా పరిస్థితిలో మార్పు రావడం లేదు.

అందుకే సక్సెస్ పది శాతం ఉంటే పరిశ్రమలో ఫెయిల్యూర్ మిగిలిన తొంబై శాతం ఆక్రమించుకుంది. నిర్మాణంలో ఉన్నప్పటి నుంచే కొంత ఆసక్తి రేపిన ”జంబ లకిడి పంబ” ఏ కోవలోకి వస్తుందా అనే అనుమానం ప్రేక్షకుల్లో ఓ మూలాన ఉంది. ఏమో ఆనందో బ్రహ్మ తరహాలో ఏదైనా సర్ ప్రైజ్ ఇవ్వొచ్చేమో అన్న అంచనాతోనే థియేటర్ లోకి అడుగు పెట్టారు ప్రేక్షకులు. మరి వాటిని నిలబెట్టుకునేలా ఉందా లేదా చూద్దాం….

వరుణ్ (శ్రీనివాస రెడ్డి), పల్లవి (సిద్ది ఇద్నాని) ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు. కొంతకాలానికే మనస్పర్థలు మొదలై వ్యవహారం విడాకుల దాకా వెళ్తుంది. దాని కోసం లాయర్ హరిశ్చంద్ర ప్రసాద్ (పోసాని) రంగంలోకి దిగుతాడు. అనుకోకుండా జరిగిన సంఘటన వల్ల హరి చనిపోతాడు.

ఆత్మ రూపంలో తిరిగి వచ్చి వరుణ్ ని అమ్మాయిగా…. పల్లవిని అబ్బాయిగా మారుస్తాడు. అలా చేస్తే ఇద్దరి ఈగోలు పోయి ఒకరినొకరు అర్థం చేసుకుంటారని హరి ప్లాన్. అసలు స్వర్గానికి వెళ్లిన ఇతను కిందకు వచ్చి మరీ ఆ జంటను ఎందుకు కలపాలనుకుంటాడు…. కథ ఎక్కడికి చేరుతుంది…. అనేది బాలన్స్.

శ్రీనివాస రెడ్డి ఇందులో హీరో కానీ హీరో. మంచి టైమింగ్ ఉన్న శ్రీనివాసరెడ్డి తనవరకు లోపం లేకుండా వరుణ్ పాత్రను నిలబెట్టే ప్రయత్నం పూర్తిగా చేసాడు. కానీ స్క్రిప్ట్ మరీ దారుణంగా ఉండటంతో ఫస్ట్ హాఫ్ లో అయితే పూర్తిగా తేలిపోయాడు.

కమెడియన్ గా తన వేషాలు తనకు వస్తున్నాయి కాబట్టి ఇలాంటివి ఆడినా ఆడకపోయినా వచ్చిన నష్టం ఏమి లేదు కాబట్టి సేఫ్ అని చెప్పొచ్చు. సిద్ది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమి లేదు. అక్కడక్కడా నిజంగానే మగాడిలా ఓవర్ యాక్షన్ చేసింది. పోసాని మరీ అతి లేకుండా కొంత వరకు నయం అనిపించాడు. వెన్నెల కిషోర్ రాను రాను మొనాటనీగా అవుతున్నాడు. సత్యం రాజేష్, జబర్దస్త్ అప్పారావు, హరితేజ సెట్టింగ్ బాగానే పెట్టుకున్నారు కానీ ఎవరిని సరిగా వాడుకోలేదు.

దర్శకుడు మురళీకృష్ణ ప్రాధమిక సూత్రం ఒకటి మర్చిపోయాడు. అప్పుడెప్పుడో ఆడిన బ్లాక్ బస్టర్ సినిమా టైటిల్ కాబట్టి కామెడీ ఎంత నాసిరకంగా ఉన్నా జనం ఎగబడి చూస్తారు అనే తప్పుడు లెక్కతో స్క్రిప్ట్ మొత్తం నాసిరకంగా రాసుకోవడం స్క్రీన్ మీద ప్రతి ఫ్రేమ్ లోను కనిపిస్తుంది. చేసిన వాళ్లంతా సీనియర్లు కాబట్టి కాసేపైనా చూడబుద్ది వేస్తుంది. ఇదే సినిమాను ముక్కు మొహం తెలియని ఆర్టిస్టులతో తీస్తే ఇంటర్వెల్ కు ముందే హాల్ ఖాళీ అయ్యేది. ఆడ మగ రివర్స్ లో జెండర్ మారిపోవడం అనే పాయింట్ లోనే అద్భుతమైన కామెడీ యాంగిల్ ఉంది. దానికి మంచి కలం బలం కావాలి. అది మిస్ కావడంతో ఏదో విచిత్రమైన సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.

కథ మరీ
సిల్లీగా ఉండటమే ఫస్ట్ మైనస్ అయితే ఎంటర్ టైనింగ్ గా చెప్పాల్సిన దానిని అక్కడికక్కడ సెట్స్ లో రాసుకున్న డైలాగ్స్ తరహాలో ఉండటం సహనానికి పరీక్ష పెడుతుంది. ఈవీవీ జంబలకిడిపంబను విపరీతంగా ఇష్టపడే హాస్య ప్రియులు మురళీకృష్ణను తూర్పారబట్టడం ఖాయం. శ్రీనివాస్ డైలాగులు తీసికట్టుగా ఉన్నాయి. సతీష్ ముత్యాల కెమెరా పనితనం ఒక్కటే కొంత చెప్పుకోదగ్గది. తమ్మిరాజు ఎడిటింగ్ గురించి ప్రస్తావించడానికి ఏమి లేదు. గోపి సుందర్ మరో చెత్త ఆల్బమ్ తన ఖాతాలో వేసుకున్నాడు. నిర్మాణ విలువలు గురించి చెప్పేంత దృశ్యం ఏమి లేదు.

చివరిగా చెప్పాలంటే పాత జంబలకిడిపంబను అవమానించేలా ఉన్న ఈ సినిమా గురించి అదే పనిగా తలుచుకుని మాట్లాడుకునే అవకాశం ఇవ్వలేదు దర్శకుడు. హాస్య ప్రధాన చిత్రం అనే ట్యాగ్ అయితే పెట్టుకున్నారు కానీ ఇది హింసించే బాపతులోకి వస్తుంది. కామెడీనే అపహాస్యం చేసేలా ఉన్న ఇలాంటి ఆణిముత్యాలను చూడలేకపోవడం జంధ్యాల, ఈవీవీ గారి అదృష్టం అనిపిస్తుంది. ప్రేక్షకులను అమాయకులుగా జమకట్టి తాము చూపించేదే కామెడీ అన్న భ్రమలో ఉన్న దర్శక రచయితలు సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూడాలంటె తప్ప దీన్ని రికమండ్ చేయడానికి మరో బలమైన కారణం ఏదీ లేదు

జంబలకిడిపంబ : అర్థం లేని గందరగోళం

Post a Comment

0 Comments